బీజేపీ-జనసేన పొత్తులపై వైసీపీకి ఉలికిపాటు ఎందుకు..?

సహజంగా ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటారు.. ఇప్పుడెందుకు పొత్తులు పెట్టుకున్నారు..? మీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడం..!.. ఇదీ అంబటి రాంబాబు…  జనసేన, బీజేపీ పొత్తుల ప్రకటన చేసిన కాసేపటికే మీడియా ముందుకొచ్చి చేసిన ప్రకటన. సహజంగా.. బీజేపీ కి సంబంధించిన అంశాల్లో స్పందించడానికి అధికార పార్టీకి మొహమాటం ఎక్కువ. బీజేపీ నేతలు చాలా కాలంగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నా… వారు పల్లెత్తు మాట అనడం లేదు. కానీ.. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నట్లుగా ప్రకటన చేయగానే…  బీజేపీపైనా విమర్శలు చేశారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని ప్రకటించేశారు.

జనసేన – బీజేపీ పొత్తు విషయంలో వైసీపీ కాస్త ఆందోళనతో ఉన్న మాట నిజమేనని.. అంబటి రాంబాబు హుటాహుటిన పెట్టిన ప్రెస్‌మీట్‌తోనే అర్థమైపోయిందన్న భావన రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. నిజానికి ఎన్నికల సమయంలో… రాజకీయ పార్టీలు పొత్తుల గురించి ఆలోచిస్తూంటాయి. కానీ.. జనసేన, బీజేపీ నాలుగున్నరేళ్ల ముందే పొత్తులు పెట్టుకున్నాయి. పైగా.. తాము 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఇదంతా వ్యూహాత్మకమైన ప్రకటించిందేనని.. వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లడంపై ఇటీవలి కాలంలో.. విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనపై ప్రజావ్యతిరేకత ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే.. దానికి తగ్గట్లుగా వ్యవహారాలను చక్కబెట్టాలని బీజేపీ అనుకుంటోందని.. చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో.. రాజధాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉందని.. అనుకోవడంతో.. వెంటనే జనసేన పార్టీని బీజేపీ దగ్గరకు తీసుకుంది. రేపు అనుకోని పరిస్థితులు ఏర్పడితే.. పవన్ ఫ్యాక్టర్..  అనేక మందిని ఆకర్షిస్తుందని ..లేకపోతే ఆకర్షించేలా చేయగలమని.. బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎలా చూసినా… ఇప్పుడెందుకు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందన్న .. వైసీపీ అనుమానం అంత తేలిగ్గా తీసి పారేయాల్సిన విషయం కాదనేది.. చాలా మంది వేసే అంచనా.  మరి ఈ విషయంలో ఏపీ నిజంగానే.. దానికి తగ్గట్లుగా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా.. లేదా.. అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

TV9