మండలి రద్దు అసలు అయ్యేపనేనా ?

సోమవారం జరగనున్న ఏపీ కేబినెట్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హీట్ రగిలిస్తోంది. శాసనమండలిని రద్దు చేసే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశముందని చర్చలు జోరుగా నడుస్తున్నాయి. గురువారం నాటి సభలో సీఎం సహా మంత్రుల ప్రసంగాలు చూస్తుంటే శాసన మండలి రద్దయ్యే అవకాశాలను ఎవ్వరూ కొట్టిపారేయలేకపోతున్నారు. అయితే బిల్లులను నెగ్గించుకునేందుకు సర్కార్‌ ఇప్పటికీ తన ముందున్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నా చర్చ అంతా శాసన మండలి రద్దు చుట్టే తిరుగుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మండలి రద్దు ఎలా చేయగలరు ప్రోసీజర్ ఏమిటి అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి.

ఒక సారి ఈ రద్దు విధానం ఎలా జరుగుతుందో చూద్దాం. నిజానికి మండలిని రద్దు తీర్మానం రాష్ట్ర అసెంబ్లీ రెండు బై మూడు వంతుల మెజారిటీతో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అలా పంపించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వంలోని లా డిపార్ట్మెంట్ ఒక నోట్ తయారు చేసి ఆ తరువాత బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయసభలు దీని మీద చర్చించి బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపాలని రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తర్వాత ఈ బిల్లు ఆక్ట్ గా మారి అమలులోకి వస్తుంది. ఇంత తతంగం జరగాలి.

2004లో మండలి ఏ విధంగా ఏర్పాటయిందో తెలుసుకుంటే రద్దు వ్యవహారం మీద కాస్త అవగాహన రావచ్చు. 2004 జూలై 8న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా నా పుట్టినరోజు కానుకగా మనందరం శాసనమండలిని ఏర్పాటు చేసుకుందామని చెప్పి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మండలిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపారు. కానీ మండలి ఎప్పుడు ఏర్పాటయింది ? అంటే పై చెప్పిన దంతా పూర్తయి మూడేళ్ల తర్వాత 2007 జనవరి లో రాష్ట్రపతి ఆమోదం పొంది మండలి ఏర్పాటు అయ్యింది. రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి కూడా ఇంత లేట్ అయింది.

మరి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తుంది ! ఎందుకంటే వారికీ ఆ సభలో ఇద్దరు సభ్యుల ప్రాతినిద్యం ఉంది. వారి మాట కాదని కేంద్ర బీజేపీ పని చేయదు. అందునా ఆ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. ఒకవేళ పై అన్ని పైరవీలు జరిగినా రాజ్యసభలో బీజేపీ కి మెజారిటీ లేదు. ఈ బిల్లు కోసం బీజేపీ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయరు. సో ఈ బిల్లు రద్దు ఎంత వరకూ సాధ్యం అవుతుంది ?