జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

జగన్ పై ప్రత్యక్ష, చిరంజీవి పై పరోక్ష విమర్శలు చేసిన బాలకృష్ణ

బాలకృష్ణ మరో మూడు రోజుల్లో షష్టి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొన్ని టీవీ చానల్స్ కు బాలకృష్ణ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ పై ప్రత్యక్షంగా చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశారు బాలకృష్ణ.

జగన్ పాలన కరోనా వైరస్ లాంటిది:
తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ. జగన్ ప్రభుత్వం మరో రెండేళ్ళు మాత్రమే అధికారంలో ఉంటుందని బాలకృష్ణ జోస్యం చెప్పారు. రాజధాని మార్చడం వంటి హాస్యాస్పదమైన నిర్ణయాలను జగన్ ప్రభుత్వం తీసుకుందని, ఇప్పటికే ప్రజలందరూ జగన్ ని గెలిపించడం పట్ల పశ్చాత్తాప పడుతున్నారని బాలకృష్ణ అన్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజల ని బాగా కన్ఫ్యూజ్ చేసిందని, ఈ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ లాంటిదే అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. 

చిరంజీవి రాజకీయ వైఫల్యం పై పరోక్ష విమర్శలు:
ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అన్నీ కలిసి వచ్చాయి అని, అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదం రావడం కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్త లో కలిసి వచ్చిందని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని బాలకృష్ణ అన్నారు. ఎన్టీ రామారావు లార్జర్ దెన్ లైఫ్ వంటి పర్సనాలిటీ అని, ఆయన తాను అనుకున్నది ఏదో తాను చేసుకుంటూ వెళ్లిపోయాడని బాలకృష్ణ అన్నారు. సమాజ సేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని అన్న బాలకృష్ణ, ఆయనని అనుకరించాలని ప్రయత్నిస్తే అది వీలు కాదని వ్యాఖ్యానించారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవడం మంచిదే కానీ, ఆయన సాధించాడు కదా మనం కూడా సాధిద్దాం అనుకుని ఎవరైనా  వస్తే మాత్రం అది సాధ్యం కాదని బాలకృష్ణ అన్నారు. ప్రత్యేకించి రాజకీయాల్లో అది సాధ్యం కాదని, దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఇటీవల ఉన్నాయంటూ పరోక్షంగా రాజకీయాల్లో చిరంజీవి వైఫల్యాన్ని గుర్తు చేస్తూ  చురకలంటించారు బాలకృష్ణ.
మొత్తానికి తనదైన స్టైల్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

follow us