వామ్మో నాకొద్దు ఈ బ్రాండ్ అంబాసిడర్..!

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రమఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం దేత్తడి హారికను తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. టూరిజం శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హారిక కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు ప్రకటించారు. అయితే కొన్ని గంటల్లోనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. టూరిజం శాఖ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస్ గుప్త సీఎం కార్యాలయానికి మరియు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ సీఎం కార్యాలయం సీరియస్ అయ్యింది. టూరిజం శాఖ ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ ను డిలీట్ చేయాలని ఆదేశించింది.
ఇక ఇదే విషయం పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వైపు కేటీఆర్ కూడా ఈ విషయంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇలాంటి వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో హారిక సంచలన నిర్ణయం తీసుకుంది. తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హారిక ఓ వీడియోను పోస్ట్ చేసింది. మహిళా దినోత్సవం నాడు తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని. అయితే ఇప్పుడు కొన్ని కారణాల వల్ల తాను తప్పుకుంటున్నానని ప్రకటించారు.