వీడియో: ‘ఆచార్య’ టెంపుల్ సెట్‌ పై సర్వత్రా విమర్శలు

  • Written By: Last Updated:
వీడియో: ‘ఆచార్య’ టెంపుల్ సెట్‌ పై సర్వత్రా విమర్శలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ‘ఆచార్య’ కోసం ఒక భారీ ఆలయం సెట్‌ను హైదరాబాద్‌లో నిర్మించింది చిత్ర యూనిట్. ఈ సెట్ అత్యద్భుతంగా ఉంది. అందుకే, ఈ సెట్‌కు సంబంధించిన విజువల్స్‌ను చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

‘ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ టౌన్ సెట్ ను 20 ఎక‌రాల విస్తీర్ణంలో వేశారు. ప్ర‌తీ చిన్న చిన్న విష‌యాల‌ను కూడా అద్బుతంగా మ‌లిచి గాలిగోపురాన్ని క్రియేట్‌చేశారు. ఇది క‌ళాద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కే ఓ మ‌చ్చుతున‌క. నాకెంతో ముచ్చ‌ట‌నిపించి నా కెమెరాలో బంధించి..మీతో పంచుకోవాల‌నుకున్నా. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా..? అనేంత‌గా టెంపుల్ డిజైన్ చేసిన క‌ళాద‌ర్శ‌కుడు సురేశ్‌ను, టెంపుల్ టౌన్ ను విజువ‌లైజ్ చేసిన కొరటాల శివ‌ను, దీన్ని నిర్మాణానికి కావాల్సినవి స‌మ‌కూర్చిన నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ల‌ను నేను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని’ చిరు వీడియోలో పేర్కొన్నాడు.

దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ మూవీ ఉంటుంది. ఇందులో రామ్‌చరణ్‌ పవర్‌పుల్‌ పాత్రలో కనిపిస్తే, చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దేవాలయాల భూముల అన్యాక్రాంతంను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని డైరెక్టర్‌ కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. రియల్ హీరో సోనూసూద్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా నెటిజన్లు ఈ వీడియోపై మిశ్రమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో టెంపుల్స్ మీద జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించలేని గొంతు టెంపుల్ సెట్ వేశామని గర్వంగా చెప్తోంది. ఏ.. ఎందుకు ? కాంగ్రెస్ నేతగా చిరు ఉన్నాడా? లేడా ? అస్సలు రాజకీయాలనే వదిలేశాడా? ఏదైనా క్లారిటీ ఇవ్వమని ప్రశ్నిస్తున్నారు. నిజజీవితంలో దేవాలయాల పట్ల ప్రశ్నించలేని చిరు, రీల్ లైఫ్ గుడి చెపుతుంటే కమర్షియల్ మైండ్ గుర్తుకువస్తుందంటున్నారు. సినిమా ప్రమోషన్ కోసం సినీ పెద్దలు కూడా ఇలా దిగజారకూడదంటున్నారు.

follow us