చిరు – విజ‌య‌శాంతి ఎపిసోడ్ హైలెట‌బ్బా…

చిరు – విజ‌య‌శాంతి ఎపిసోడ్ హైలెట‌బ్బా…

స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లోని ఎల్ బీ స్టేడియంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈవెంట్ అంతా ఒక ఎత్త‌యితే.. చిరంజీవి – విజ‌య‌శాంతి ఎపిసోడ్ మ‌రో ఎత్తు. చిరు – విజ‌య‌శాంతి… వెండి తెర‌పై తిరుగులేని జోడీ. ఇద్ద‌రు కలిసి న‌టిస్తే బొమ్మ సూప‌ర్ హిట్ అంతే. ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌ప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింద‌ని అప్ప‌ట్లో చెప్పుకునేవారు. ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి వెళ్లాక అది మ‌రింత ఎక్కువైంది. చిరుని టార్గెట్ చేస్తూ విజ‌య‌శాంతి చాలాసార్లు కామెంట్లు చేసింది. విమ‌ర్శించింది. ఆ త‌ర‌వాత చిరు – విజ‌యశాంతి క‌లిసింది లేదు. ఓ వేడుక‌లో చూసింది లేదు. ఇంత కాలానికి చిరు, విజ‌య‌శాంతి ఇద్ద‌రూ ఒకే స్టేజీపై ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ అవ‌కాశాన్ని చిరు స‌ద్వినియోగం చేసుకున్నారు.

చిరు మాట్లాడున్న‌ప్పుడు విజ‌య‌శాంతి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. తాము క‌లిసి ప‌నిచేసిన హిట్ సినిమాల్నీ, అందులోని పాట‌ల్నీ గుర్తు చేసుకుంటూ.. మ‌న‌సు పాలిటిక్స్ వైపు మ‌ళ్లింది. ‘ఇద్ద‌రం క‌లిసి ఎన్నో సినిమాలు చేశాం. నాకంటే ముందు రాజ‌కీయాల్లోకి వెళ్లావు. న‌న్ను అన్ని మాట‌లు ఎలా అనాల‌నిపించింది’ అంటూ విజ‌య‌శాంతిని ప్ర‌శ్నించే స‌రికి… అంద‌రూ షాక్ తిన్నారు. అంత‌లోనే.. న‌వ్వేశారు. చిరంజీవి ఆ విష‌యాన్ని చెప్పిన విధానం అంత కూల్‌గా ఉంది మ‌రి. ‘నువ్వు అన్న‌న్ని మాట‌లు అంటున్నా.. నేనెప్పుడైనా నిన్ను ఏమైనా అన్నానా’ అనేస‌రికి విజ‌య‌శాంతి కూడా మైకు తీసుకుని ‘ముందు అన‌లేకపోతే వెనుక అన్నారేమో’ అంటూ కౌంట‌రేసింది. ‘ఐస్వేర్‌’ అంటూ చిరు ఒట్టు వేయ‌డం – ‘ముందే అన‌లేని వాడిని. వెనుక అంటానా’ అంటూ స‌మాధానం చెప్ప‌డంతో మ‌రోసారి న‌వ్వులు విరిశాయి. అంతేకాదు… రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయినా, ఆ గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.. అదే పొగ‌రు – అదే ఫిగ‌రు అంటూ విజ‌య‌శాంతిని ఆకాశానికి ఎత్తేశాడు చిరు. ‘ఇప్పుడు మ‌నం మ‌ళ్లీ క‌లిసి న‌టిద్దామా’అంటూ విజ‌య‌శాంతి కూడా ఓ ఆఫ‌ర్ ఇచ్చింది వై నాట్ అంటూ చిరు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

రాజ‌కీయాల వ‌ల్ల శ‌త్రువులు పెరిగితే సినిమాల వ‌ల్ల మిత్రులు ద‌గ్గ‌ర‌వుతార‌ని, ఈ వేడుక ద్వారా విజ‌యాశాంతి మ‌ళ్లీ త‌న‌కు ద‌గ్గ‌రైంద‌ని, ఈ క్రెడిట్ మ‌హేష్‌బాబుదే అన్నారు చిరంజీవి. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం.. బాగా ర‌క్తి క‌ట్టింది. చాలా సీరియ‌స్ విష‌యాన్ని చిరంజీవి సింపుల్‌గా తీసుకోవ‌డం, పాత వైరాన్ని మ‌ర్చిపోయి, విజ‌య‌శాంతిని ద‌గ్గ‌ర తీసుకోవ‌డం – చూడుమ‌చ్చ‌ట‌గా  అనిపించింది.

Source : Telugu360

Tags

follow us

Web Stories