పదోసారి సంక్రాంతి బరిలో దిగుతున్న చిరు – బాలయ్య..పైచేయి ఎవరిదీ అవుతుందో..?

సంక్రాంతి అంటే తెలుగు వారికే కాదు సినీ లవర్స్ కు కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా చూసుకుంటారు. ఇక నిర్మాతలు సైతం సంక్రాంతి కి రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని , రెండు , మూడు రోజుల్లోనే తమ పెట్టుబడి వెనక్కు వస్తుందని భావిస్తారు. అందుకే పెద్ద , పెద్ద సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ 2023 సంక్రాంతి కి ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి , బాలకృష్ణ లతో పాటు తమిళ్ హీరో విజయ్ పోటీ పడుతున్నారు. అయితే విజయ్ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు సినీ జనాలు.
తెలుగు డైరెక్టర్ , తెలుగు నిర్మాతే అయినప్పటికీ తమిళ్ సినిమాగానే భావిస్తున్నారు. ఇక ఫోకస్ అంత కూడా చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య , బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి లపైనే పెట్టారు. ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్ అవుతుంది..ఏది హైయెస్ట్ కలెక్షన్లు రాబడుతుంది అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే సంక్రాంతి బరిలో చిరంజీవి , బాలకృష్ణ లు రావడం ఇదేం మొదటి సారో, రెండో సారో కాదు పదో సారి. అవును ఇప్పటివరకు వీరిద్దరూ తొమ్మిది సార్లు పోటీపడ్డారు. అందులో కొన్ని సార్లు చిరంజీవి ఫై చేయి సాధిస్తే..మరికొన్ని సార్లు బాలకృష్ణ పైచేయి సాధించారు. మరి ఈసారి ఎవరు ఫై చేయి సాదిస్తారనేది ఆసక్తి గా మారింది.
మొదటిగా వీరిద్దరూ 1985 లో చిరంజీవి ‘చట్టంతో పోరాటం’ .. బాలకృష్ణ ‘ఆత్మబలం’ చిత్రంతో పోటీ పడ్డారు. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. రెండోసారి1987 లో ‘దొంగ మొగుడు’ తో చిరంజీవి, ‘భార్గవ రాముడు’ తో బాలయ్య పోటీ పడ్డారు. అయితే చిరంజీవి నటించిన ‘దొంగ మొగుడు’ బ్లాక్ బస్టర్ హిట్ గా విజయం సాధించింది.
ఇక మూడోసారి 1988 లో చిరంజీవి ‘మంచి దొంగ’ తో.. బాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ తో పోటీ పడగా..ఈ రెండు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. నాలుగోసారి 1997 లో చిరంజీవి ‘హిట్లర్’ తో.. బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ తో పోటీ పడ్డారు. ఈసారి కూడా ఇద్దరూ సక్సెస్ సాధించారు. 1999 లో ఐదోసారి చిరంజీవి ‘స్నేహం కోసం’ తో… బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ తో పోటీ పడ్డారు. ‘స్నేహం కోసం’ పెద్దగా విజయం సాధించలేదు. సమరసింహా రెడ్డి మాత్రం పెద్ద విజయం సాధించింది.
ఆరోసారి 2000 లో చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రంతో… బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ చిత్రంతో బరిలోకి దిగగా… ‘అన్నయ్య’ సినిమా హిట్ అవ్వగా, ‘వంశోద్ధారకుడు’ ప్లాప్ గా మిగిలింది. 2001 లో ఏడోసారి చిరంజీవి ‘మృగరాజు’ తో.. బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ తో పోటీ పడ్డారు. ‘నరసింహ నాయుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘మృగరాజు’ డిజాస్టర్ అయ్యింది. ఎనిమిదో సారి 2004 పోటీపడ్డారు. చిరంజీవి ‘అంజి’ చిత్రంతో .. బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘అంజి’ డిజాస్టర్ గా కాగా ‘లక్ష్మీ నరసింహ’ సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక 2017 లో తొమ్మిదో సారి ఈ ఇద్దరు పోటీ పడ్డారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో.. బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రంతో పోటీ పడగా.. ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇలా తొమ్మిది సార్లు పోటీపడ్డారు. మరి ఇప్పుడు పదో సారి ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.