రివ్యూ: క్లైమాక్స్‌

రివ్యూ:  క్లైమాక్స్‌

పాడుబ‌డ్డ బావిలో మురికే ఉంటుంది.
ఒక‌ప్పుడు తీయ్య‌టి నీళ్లు ఇచ్చింది క‌దా అని, ఓ గుక్కెడు నీళ్లు గొంతులోకి దించుకోం క‌దా..?

రాంగోపాల్ వ‌ర్మ అదే టైపు. శివ నుంచి స‌ర్కార్ వ‌ర‌కూ… ‘సినిమా అంటే ఇలా తీయాల్రా’ అని అనిపించుకున్నాడు. ఇంకో వైపు చూస్తే.. ఐస్ క్రీములూ, జీఎస్‌టీలూ. ‘సినిమా ఇలా మాత్రం తీయ‌కూడ‌దు’ అని నింద‌లూ వేయించుకున్నాడు. వ‌ర్మ ద‌గ్గ‌ర స‌రుకెంతోకొంత ఉండే ఉంటుంది.. అని న‌మ్మిన ప్ర‌తీసారీ.. తాను `పీల్చి పిప్పిచేసిన చెర‌కు చెత్తే` అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసిన `క్లైమాక్స్` సినిమా కోసం. దీన్ని సినిమా అన‌కూడ‌దేమో. కొంచెం సాగ‌దీసిన షార్ట్ ఫిల్మ్ అనాలి. కానీ.. సినిమా రేంజులో, చూడ్డానికి రూ.100 లాగేసుకుంటున్నాడు కాబ‌ట్టి.. ఖ‌రీదైన షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా అనుకోవొచ్చు.

క‌రోనా కాలం ఇది. లాక్ డౌన్‌లో ఉంది ప్ర‌పంచం. ఈ లాక్ డౌన్‌లో అంతా ఇల్లు ఊడ్చి, గిన్నెలు క‌డిగి వీడియోలు పోస్ట్ చేస్తే.. నేను ఏకంగా సినిమా తీసేశాను.. అని ప్ర‌క‌టించుకున్నాడు వ‌ర్మ‌. వ‌ర్మ ఎలాంటి సినిమా తీశాడ‌న్న‌ది ఇప్పుడు టాపిక్ కాదు, లాక్ డౌన్ వేళ వ‌ర్మ సినిమా ఎలా తీశాడ‌న్న‌ది ప్ర‌శ్న‌. పైగా థియేట‌ర్లు లేక‌, సినిమాలు రాక‌, ఓటీటీల‌పై ఆధార ప‌డిపోయిన స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు… వ‌ర్మ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే, కాల‌క్షేపం కోస‌మైనా ఓ లుక్ త‌ప్ప‌కుండా వేస్తాడు. పైగా కుర్ర‌కారుని గాలం వేయ‌డానికి వ‌ర్మ మ‌రోసారి మియా మాల్కోవాని రంగంలోకి దించాడు. అందుకే `క్లైమాక్స్‌` వైపు కాస్త గాలి మ‌ళ్లింది.

ఓ జంట‌.. స‌ర‌దాగా విహార యాత్ర కోసం ఎడారిలోకి వెళ్తుంది. అక్క‌డ వాళ్ల‌కు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. వాట‌న్నింటి నుంచి ఆ జంట ఎలా త‌ప్పించుకుంది?  అక్క‌డ వాళ్ల‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి?  అన్న‌దే `క్లైమాక్స్‌` కాన్సెప్టు. దీన్ని బ‌ట్టి చెప్పేయొచ్చు. ఓటీటీ కాలంలో కూడా వ‌ర్మ `రాత్రి` నాటి కాన్సెప్టుల ద‌గ్గ‌రే ఆగిపోయాడ‌ని. మియా మాల్కోవా ఉంది కాబ‌ట్టి… వేడి వేడి ముద్దులు, న‌గ్న దృశ్యాలూ, తొడ‌ల ఎక్స్‌పోజింగుల‌కూ కొద‌వ లేకుండా చూసుకున్నాడు. ఎడారిలో ప‌రుగులు, మిట్ట‌మ‌ధ్యాహ్న‌మే స్పోర్ట్స్ బైకుల‌పై ర‌య్యో.. ర‌య్యో అంటూ దాడి చేసే దెయ్యాలూ… వాళ్ల నుంచి త‌ప్పించుకో క్ర‌మంలో ఛేజింగులూ.. ఇలా 52 నిమిషాల నిడివి గ‌ల ఈ క్లైమాక్స్‌లో ఎన్ని ర‌స‌వ‌త్త‌ర‌మైన ఘ‌ట్టాలో.

ఓ ద‌ర్శ‌కుడు చేతికి త‌క్కువ స‌మ‌యం దొరికిందంటే అర్థం… అందులోనే వీలైనంత క్రియేటివిటీ చూపించ‌మ‌ని. రెండున్న‌ర గంట‌ల సినిమాలో సాగ‌దీత‌లూ, పాజ్‌లూ, న‌త్త‌న‌డ‌క‌లూ ఉండ‌డంలో త‌ప్పు లేదు. 50 నిమిషాల సినిమా ఎంత గ్రిప్పింగ్‌గా ఉండాలి?  `వాట్ ద ఫ‌క్ ఈజ్ గోయింగ్ ఆన్ హియ‌ర్‌` అంటూ మియా మాల్కోవా ప‌దే ప‌దే అరుస్తుంటుంది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుడిదీ అదే బాధ‌. అదే డైలాగూ. `భ‌యాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేం. వ‌ర్ణిస్తే అది భ‌యం కాదు` అని వ‌ర్మ ఈ సినిమా ప్రారంభంలో చెప్పాడు. ఈ కొటేష‌న్ చూస్తే వ‌ర్మ ఎంత‌లా భ‌య‌పెడ‌తాడో అనిపిస్తుంది. భ‌యం కాదు..క‌దా.. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఓ ర‌క‌మైన బాధ వెంటాడుతుంది. ఎలాంటి వ‌ర్మ ఎలా అయిపోయాడ‌ని కాదు, ఎందుకంటే.. వర్మ ప‌త‌నం ఎప్పుడో మొద‌లైంది. ఇప్పుడు కొత్త‌గా న‌ష్ట‌పోయిందేం లేదు. వంద రూపాయ‌లు పెట్టి, ఈసినిమా చూడ‌డం అవ‌స‌ర‌మా? ఎందుకీ త‌ప్పు చేశాం?  మ‌ళ్లీ వ‌ర్మ‌ని ఎందుకు న‌మ్మాం.. అని.

మీయా మాల్కోవా న‌టించ‌డానికి శ‌త‌తా స‌హ‌స్ర‌దా ప్ర‌య‌త్నించింది. మేల్ క్యారెక్ట‌ర్ అయితే… డైలాగుల్లేని యాడ్ ఫిల్మ్స్‌లో న‌టించే జూనియ‌ర్ ఆర్టిస్టులా ఉన్నాడు. మిగిలిన వాళ్లంతా లోక‌ల్ టాలెంటే. నిజానికి ఇది లాక్ డౌన్ లో తీసిన సినిమా అంటున్నాడు గానీ, ఇది వ‌ర‌కే తీసి దాచుకుని ఉంటాడు. ఇప్పుడు లాక్ డౌన్ పేరు చెప్పి, ఆ సినిమాని ఆన్ లైన్లో విడుద‌ల చేసి, ఎంతో కొంత సొమ్ము చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు. సాంకేతిక విభాగాల గురించి సైతం చ‌ర్చించేంత సీన్ `క్లైమాక్స్‌`కి లేదు.

ఫినిషింగ్ ట‌చ్‌:  సినిమా (అలా అనొచ్చా) మొద‌లైన కాసేప‌టికే క్లైమాక్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాం కాబ‌ట్టి.. దీనికి ఆ పేరు పెట్టాడేమో..?

Tags

follow us