కరోనాను మహమ్మారిగా ప్రకటించిన WHO.. అన్ని దేశాలూ అలర్ట్

Corona Virus declared as Pandemic by WHO
Corona Virus declared as Pandemic by WHO

కరోనావైరస్ యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ అన్ని దేశాలనూ అతలాకుతలం చేస్తోంది. దాదాపు వందకుపైగా దేశాలకు కోవిడ్-19 వ్యాపించడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌ను ప్రపంచ వ్యాధి (మహమ్మారి)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ అలర్టయ్యాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో టూరిస్ట్ వీసాలపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 15 వరకు ఉద్యోగులు, రాయబారుకు ఇచ్చే వీసాలు మినహా మిగిలిన అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

WHO లెక్కల ప్రకారం.. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,291 మంది చనిపోయారు. మరో లక్షా 18వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా బయట కరోనా కేసులు కేవలం రెండు వారాల్లోనే 13 రెట్లు పెరిగాయి. దాదాపు 114 దేశాలకు కరోనా వ్యాధి వ్యాపించింది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,158 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది కోవిడ్-19. ఇటలీలో ఇప్పటి వరకు 631 మంది మరణించారు. ఇరాన్‌లో 291, దక్షిణ కొరియా 61, అమెరికాలో 31, ఫ్రాన్స్‌లో 33, స్పెయిన్లో 36, జపాన్‌లో 12, యూకే 6, నెదర్లాండ్స్ 4, ఆస్ట్రేలియా 3, హాంగ్‌కాంగ్ 3, స్విట్జర్లాండ్‌లో ఇద్దరు చనిపోయారు. భారత్‌లో 60 మందికిపైగా కరోనా బారినపడ్డారు.