వణికిస్తోన్న కొత్త వైరస్.. 17 మంది మృతి..!

వణికిస్తోన్న కొత్త వైరస్.. 17 మంది మృతి..!

మరో కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాల్ని వణికిస్తోంది.. కరోనా వైరస్… చైనాతో పాటు మరికొన్ని దేశాల్ని భయపెడుతుంది. దీని బారినపడి ఇప్పటికే చైనాలో 17 మంది చనిపోగా… 440 కేసులు నమోదయ్యాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌… స్వాసనాళాల్లో ప్రవేశించి… చివరకు ప్రాణాలనే తీస్తుంది. ఈ వారంలోనే చైనా కొత్త ఏడాది వేడుకలు జరగనుండగా లక్షలాది మంది ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. వైరస్ మరింత వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున దీనిని నివారించే చర్యలకు పలు దేశాలు శ్రీకారం చుట్టాయి. వుహాన్‌ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, రహదారులపై టెంపరేచర్‌ చెక్‌ చేయడంతో పాటు… స్థానికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. 

Video : కరోనా వైరస్ స్క్రీనింగ్ ఫ్లైట్స్ లో 

కరోనా వైరస్‌.. ప్రమాదకరమైన సార్స్ వైరస్‌ను పోలి ఉండటంతో కలకలం రేగుతోంది. 2003లో విజృంభించిన సార్స్ వైరస్ కారణంగా చైనా, హాంగ్‌కాంగ్‌లో 650 మంది చనిపోయారు. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఇప్పటికే థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియాలకు ఈ వైరస్‌ పాకింది. మరోవైపు చైనా పర్యటనకు వెళ్లిన భారతీయుల్ని కూడా ప్రభుత్వం అలర్ట్‌ చేసింది. ఇటు ఈ వైరస్‌ను గుర్తించడం కష్టమైన పని అంటున్నారు వైద్యులు. ఈ తరహా వైరస్‌లు మొత్తం ఏడింటిని ఇప్పటివరకు గుర్తించారు. గతంలో సార్స్‌, మెర్స్‌  వైరస్‌లు కూడా చైనాలో విజృంభించి వందల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ముందు జలుబు, తర్వాత జ్వరం, దగ్గు, ఛాతి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు… చివరకు న్యుమోనియా వరకు వెళ్లి ప్రాణాలు తీస్తుంది.  చలికాలంలో ఇది ఎక్కువగా విజృంభిస్తుంది. ఇటు బీజింగ్‌, షాంఘై, దక్షిణ గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోనూ 20 మందికి పైగా ఈ వైరస్‌ బారినపడ్డారు. అంతేగాక, దక్షిణకొరియా, జపాన్‌, థాయ్‌లాండ్‌లోనూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. 

Tags

follow us