మ‌ళ్లీ రాజుకున్న దాస‌రి ‘ఆస్తి’ గొడ‌వ‌లు

Dasari Arun Kumar - Dasari Prabhu
Dasari Arun Kumar - Dasari Prabhu

చిత్ర‌సీమ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా, దాస‌రి ముందుండేవారు. ఆ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేసేవారు. ఇప్పుడు ఆ ఇంట్లోనే గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. కానీ… ప‌రిష్క‌రించ‌డానికి ఏ ఒక్క‌రూ లేని ప‌రిస్థితి.

వివ‌రాల్లోకి వెళ్తే… దాస‌రికి ఇద్ద‌రు త‌న‌యుడు. ఒక‌రు ప్ర‌భు, మ‌రొక‌రు దాస‌రి అరుణ్ కుమార్‌. వీరిద్ద‌రి మ‌ధ్య ఆస్తికి సంబంధించిన గొడ‌వ‌లు ముందు నుంచీ ఉన్నాయి. ఇప్పుడు అవి ముదిరిపోయాయి. గ‌త రాత్రి జూబ్లీ హిల్స్‌లోని దాస‌రి ప్ర‌భు ఇంటి గోడ దూకి అరుణ్‌ప్ర‌వేశించిన‌ట్టు, ఇంట్లోకి చొర‌బ‌డి బీరువా బ‌ద్ద‌లు కొట్ట‌డానికి య‌త్నించిన‌ట్టు ప్ర‌భు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు నిక్షిప్త‌మ‌య్యాయి. వాటిని స్వాధీన ప‌ర‌చుకున్న పోలీసులు అరుణ్‌పై కేసు న‌మోదు చేశారు.

త‌న త‌ద‌నంత‌రం ఆస్తిపంప‌కాలు చేయాల్సిందిగా ఆ బాధ్య‌త‌ని ముర‌ళీమోహ‌న్‌, మోహ‌న్ బాబు, సి. క‌ల్యాణ్‌కి అప్ప‌గిస్తూ వీలునామా రాశారు దాస‌రి. ఈ ముగ్గురూ గ‌తంలో ఈ త‌గాదాని ప‌రిష్క‌రించాల‌ని చూసినా వీలు కాలేదు. మ‌రీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్‌లోని దాస‌రికి పెద్ద ఇల్లుంది. అప్ప‌ట్లో దాస‌రి అందులోనే ఉండేవారు. ఆ ఇల్లు నాదంటే నాదంటూ.. ఇద్ద‌రు కొడుకులూ త‌గువులాడుకుంటున్నారు. నిజానికి ఆ ఇల్లు ప్ర‌భు కూతురి పేరు మీద రాసిచ్చారు దాస‌రి. ఆ ఇంటి చుట్టూనే వివాదం న‌డుస్తుంది. ఆ ఇంట్లోకే దొంగ‌చాటుగా చొర‌బ‌డి, సీసీ టీవీ కెమెరాకు చిక్కాడు అరుణ్‌.

హైద‌రాబాద్ శివార్ల‌లో దాస‌రికి ఓ ఫామ్ హౌస్ ఉంది. అందులో కొన్ని ఎక‌రాల్ని అరుణ్ అమ్మేశాడ‌ని, వాటికి సంబంధించిన డ‌బ్బులు ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భు ఆరోపిస్తున్నాడు. దాస‌రికి సంబంధించిన కొన్ని ఆస్తుల్ని ఇప్ప‌టికే అరుణ్ అమ్మేశాడ‌ని, వాటి లెక్కా ప‌త్రాలు తెలియ‌కుండా పోయాయ‌ని, ఇప్పుడు ఈ ఇంటిపై ప‌డ్డాడ‌ని, త‌న‌ని చంపుతాన‌ని బెదిరించాడ‌ని ప్ర‌భు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇప్ప‌టికైనా సినిమా పెద్ద‌లు స్పందించి, ఈ త‌గువుని ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భు కోరుతున్నాడు.