మహేష్ – పవన్ సినిమాలు భారీగా ఆర్ధిక నష్టం తెచ్చాయి – దిల్ రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో దిల్ రాజు అంటే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రబ్యూటర్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన రాజు..దిల్ సినిమా తో నిర్మాతగా మారి..దిల్ రాజు అయ్యారు. ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరిగా సత్తాచాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాజు..ప్రస్తుతం వారసుడు మూవీ తో సంక్రాంతి బరిలో రాబోతున్నారు. తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్య క్రమాలు చేపట్టి సినిమా ఫై అంచనాలు పెంచుతున్న రాజు..తాజాగా తెలుగు మీడియా తో ముచ్చటించి..పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
వారసుడు సినిమా రిలీజ్ విషయంలో పెద్ద గందరగోళం సృష్టించారని..కానీ వారసుడు సినిమా డబ్బింగ్ కాదని, పాన్ ఇండియా సినిమా అని దిల్ రాజు అన్నారు. నేను మొండివాణ్ణి .. నాకు నచ్చితే డిస్ట్రిబ్యూటర్ గా .. ప్రొడ్యూసర్ గా ఎక్కడివరకైనా వెళ్లి రిస్క్ చేస్తాను. ఇక్కడ చాలా పోటీ ఉంటుంది .. ఆ పోటీలో మనం ఉండక తప్పదు అన్నారు. సినిమా ఆడుతుందా లేదా అనేది జడ్జ్ చేసేవాడే మగాడు. ఈ సినిమాను మనం తీసుకోవచ్చు అని నేను జడ్జ్ చేస్తూ ఉంటాను. అలా తీసుకున్న సినిమాలు ఒక్కోసారి మిస్ ఫైర్ కూడా కావొచ్చు. మహేష్ బాబు ‘స్పైడర్’ .. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశా..ఆ రెండు సినిమాలు నా కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్ చేసాయి. అయినా నేను తట్టుకుని నిలబడ్డాను” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
“నేను తట్టుకోవడానికి కారణం ఉంది. 2017లో నిర్మాతగా నేను వరుస సక్సెస్ లు చూడటం వలన, అక్కడ వచ్చిన డబ్బు ఇక్కడ పోయింది. అందువలన బ్యాలెన్స్ అయింది. అలా కాకుండా దగ్గరున్న డబ్బుపోతే ఎవడైనా సూసైడ్ చేసుకోవడమో .. ఇండస్ట్రీ నుంచి పారిపోవడంతో జరుగుతుంది. ఇక్కడ ముందుకు వెళ్లాలంటే రిస్క్ చేయవలసిందే” అంటూ రాజు చెప్పుకొచ్చారు.