రెండోసారి ఫైల్‌ తిప్పిపంపిన అసెంబ్లీ కార్యదర్శి

సెలెక్ట్ కమిటీ వివాదం మరో మలుపు తిరిగింది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ సెక్రటరీ రెండోసారి ఫైల్‌ను తిప్పిపంపారు. ఇప్పుడు మండలి ఛైర్మన్ ఏం చేస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు అంశాలపై సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి ఛైర్మన్ జనవరి 22వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలంటూ పార్టీలను ఆదేశించారు. వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ కమిటీలకు తమ పేర్లను అందజేశాయి. దీంతో ఆ పేర్లతోనే సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ బులెటిన్ జారీ చేయాలని కార్యదర్శిని మండలి ఛైర్మన్ ఆదేశించారు.

అయితే .. సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అధికారం తనకు లేదన్నారు సెక్రటరీ. ఇందుకు సెక్షన్‌ 154ను తెరపైకి తీసుకొచ్చారు. దీనిప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కార్యదర్శి ఆ ఫైల్‌ను మండలి ఛైర్మన్‌కు తిప్పిపంపారు. దీనిపై మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై బులెటిన్ జారీ చేయాలంటూ రెండోసారి సెక్రటరీని ఆదేశించారు.

దీన్ని కూడా అసెంబ్లీ కార్యదర్శి తిప్పిపంపారు. ఇదిప్పుడు వివాదానికి కారణమవుతోంది. కార్యదర్శి తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సెక్రటరీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని భావించింది. తాజాగా రెండోసారి తిప్పిపంపడంతో న్యాయపరమైన పోరాటం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ అంశంపై వైసీపీ మరో వాదన తెరపైకి తీసుకొచ్చింది. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి 14 రోజుల దాటడంతో ఇక సెలెక్ట్ కమిటీ ప్రస్తావనే ఉండదని చెప్తోంది. బిల్లులు కూడా ఆమోదం పొందినట్టేనని వెల్లడించింది.