ఫారిని రిటర్నీస్ తిప్పలు..! ఇంటికి వెళ్లనిస్తేనే కదా.. “హోం క్వారంటైన్”..!

విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్టుల్లో వేస్తున్న హోం క్వారెంటైన్ ముద్రలు… వారిని ఇళ్ల దగ్గరకి కూడా వెళ్లనీయడం లేదు. మెట్రో సిటీల్లో విమానాలు దిగి.. సొంత ఊళ్లకు రైళ్లో..బస్సులో పట్టుకుని వెళ్తున్న వారిని తోటి ప్రయాణికులు పోలీసులకు పట్టిస్తున్నారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా విదేశాల నుంచి వచ్చే వారిలోనే ఉంంటున్నాయి. దాంతో..  ప్రభుత్వం ఈ రోజు నుంచి సరిహద్దుల్ని మూసేసింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. నిన్నటి వరకూ విమానాలు.. దేశంలోకి వచ్చాయి. వాటిలో పెద్ద ఎత్తున భారతీయులు వచ్చారు. వారందరికీ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహింస్తున్నారు.

ఫద్నాలుగు రోజుల పాటు.. క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. అలా తరలించిన తర్వాత వారిలో కరోనా లక్షణాలు బయటపడకపోతే..ముందు జాగ్రత్తగా.. మహో ఫద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండాలంటూ.. హోంక్వారెంటైన్ ముద్ర వేసి పంపుతున్నారు. ఇలా ముద్రలు వేయించుకుని సొంత ఊళ్లకు వస్తున్న వారికి.. ఆ ముద్రలు…  వెంటాడుతున్నాయి. పొరపాటున రైల్లోనే.., బస్సులోనే ప్రయాణించేటప్పుడు ఆ ముద్రలు పక్క ప్రయాణికులు చూస్తే.. వెంటనే రచ్చ అయిపోతోంది. వెంటనే.. రైళ్లను.. బస్సుల్ని నిలిపివేసి.. అతన్ని… మళ్లీ క్వారంటైన్ సెంటర్ కు తరలించేదాకా వదిలి పెట్టడం లేదు. తనకు అన్ని పరీక్షలు చేశారని.. కరోనా లేదని సర్టిఫికెట్ కూడా ఇచ్చారని.. హోంక్వారంటైన్ ముద్ర వేశారని.. అందుకే.. తాను ఇంటికెళ్తున్నానని.. ఇంట్లో పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటానని చెప్పినా.. ఎవరూ వినిపించుకోవడం లేదు.

విదేశాల నుంచి వచ్చిన వారికి ఇదో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఈ రోజు నుంచి ప్రత్యేకంగా భారతీయుల్ని తీసుకొస్తున్న విమానాలు తప్ప.. మరొక్క విమానం కూడా ఇండియాలో దిగదు. కాబట్టి.. ఇక విదేశీ ప్రయాణికులు కూడా రారు. అయితే.. ఇలాంటి ముద్రలు ఉన్న వారిలో ఎక్కువ మంది క్వారెంటైన్ సెంటర్ల నుంచి పారిపోయి వస్తున్నారని చూసేవాళ్లు అనుమానిస్తున్నారు. కానీ క్వారంటైన్ సెంటర్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని..అధికారవర్గాలు చెబుతున్నాయి.