నితిన్ ‘చెక్ ‘ మూవీ రివ్యూ.!

nithin check movie review
nithin check movie review

యంగ్ హీరో నితిన్ విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా “చెక్”. ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లు నటిస్తున్నారు. సినిమాలో సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై ముందు నుండి అంచలనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈరోజు విడుదలైన చెక్ రీచ్ అయ్యిందా.? లేదా ? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ & కథనం : సినిమా ప్రారంభం తోనే కోర్ట్ రూమ్ డ్రామా సీన్లతో మొదలవుతుంది. ఆదిత్య (నితిన్) ను టెర్రరిస్ట్లకు సహాయం చేసినందుకు గాను జైల్లో పెడతారు. ఈ కేసులో దేశ ద్రోహం కింద నితిన్ కు జీవిత ఖైదు అమలు చేస్తారు. దాంతో డీలా పడిపోయిన నితిన్ కు మానస (రకుల్ ప్రీత్ సింగ్ ) కేసును టెకప్ చేయడంతో మళ్ళీ ఆశలు చిగురిస్తాయి. ఈ క్రమంలో ఆదిత్య తన ఫ్లాష్ బ్యాక్ ను మానస తో షేర్ చేసుకుంటాడు. ఆదిత్య తన ఫ్లాష్ బ్యాక్ లో యాత్ర ( ప్రియా ప్రకాష్ వారియర్) తో ప్రేమలో పడతాడు. అయితే సినిమా ఇంటర్వెల్ కి ముందు చిన్న ట్విస్ట్ సినిమా కథ మలుపు తిరుగుతుంది. ముందు నుండి చెస్ క్రీడాకారుడిగా ఉన్న నితిన్ మళ్లీ చెస్ ఆడటం మొదలు పెడతారు. అంతే కాకుండా ఛాంపియన్ షిప్ ఆటల్లో పాల్గొని గెలుస్తాడు. అక్కడితో ఆగకుండా చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సొంతం చేసుకుంటాడు. జైల్లో కూడా చెస్ మాస్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. అక్కడే సినిమాకు సంబంధించి మరి కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ చోటు చేసుకుంటాయి. ఇక ఆదిత్య ఈ కేసు నుండి ఎలా బయట పడతాడు.. అసలు కేసు నుండి బయట పడతాడా లేదా.? టెర్రరిస్ట్ లతో ఆదిత్యకు సంబంధం ఏమిటి.? ఈ కేసును అసలు మానస ఎందుకు టెకప్ చేసిందన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : విలక్షణ సినిమాలు తీసి అలరించిన చంద్ర శేఖర్ ఏలేటి లాంటి దర్శకుడి నుండి ఎలాంటి సినిమాను ఆశిస్తామో అలాంటి సినిమానే చెస్. ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో రక్తికట్టించేలా సాగుతుంది. చిత్రంలో ప్రీ ఇంటర్వెల్ సీన్లతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తరవాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది. కొత్త సబ్జెక్టు తో వచ్చినా అనుకున్న కథను చూపించడంలో దర్శకుడు ఏలేటి ఎక్కడా తగ్గలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసే సస్పెన్స్ సీన్లతో సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో లాజిక్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఎమోషనల్ సీన్లపై తక్కువ దృష్టి పెట్టడంతో సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలతో సినిమాను పైకి లేపాడు. దాంతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ రావడానికి అవకాశం లేదు. మొత్తానికి రోటీన్ మాస్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు చెక్ సినిమా ఒక మంచి ఫీల్ ఇస్తుంది.