ఏపీలో తెలుగు మీడియం మాయం..!

  • Written By: Last Updated:
ఏపీలో తెలుగు మీడియం మాయం..!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యంలో వెనుకబడుతున్నారన్న ఉద్దేశంతో… అర్బన్ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీనిపై రేగిన గగ్గోలు అంతా ఇంతా కాదు. తెలుగు భాషా ఉద్ధారకులు అని స్వయం ప్రకటిత మేధావులంతా.. తలా ఓ రాయి వేశారు. మాతృభాష సెంటిమెంట్ కలగలిపి.. చంద్రబాబును చెడామడా తిట్టేశారు. వారంతా.. ఇప్పుడు.. అదే తెలుగును ఉద్ధరించే… పదవులు ప్రస్తుత ప్రభుత్వంలో పొందారు. అయితే ఇప్పుడు…ప్రభుత్వం  చంద్రబాబు ఆలోచనను మరింత విస్తృతం చేసింది.. . అసలు మొత్తం తెలుగు మీడియాన్నే ఎత్తేయాలని నిర్ణయించుకుంది.

తెలుగు రాష్ట్రంలో ఇక ఓన్లీ ఇంగ్లిష్ మీడియం..!

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఎనిమిదో తరగతి వరకు తెలుగును కేవలం ఒక సబ్జెక్టుకు కుదించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో అంత వ్యతిరేకత వచ్చినా.. ఇప్పుడు ప్రభుత్వం ఇంత సీరియస్ నిర్ణయం ఎందుకు తీసుకుందనే ఆశ్చర్యం చాలా మందికి వస్తుంది. కానీ.. అప్పుడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లభించింది. ప్రస్తుతం… ప్రభుత్వ స్కూళ్లలో… తెలుగు మీడియంకు సమాంతరంగా ఇంగ్లీషు మీడియం నిర్వహిస్తున్నారు. ఆసక్తి మేరకు విద్యార్థులు ఏ మీడియంనైనా ఎంచుకొనేలా ఏర్పాట్లు ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అలాంటి అవకాశమే లేదు. అందరూ.. కచ్చితంగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి.

ప్రభుత్వ టీచర్లలో ఎంత మందికి ఇంగ్లిష్ వచ్చు..!?

మొత్తం ఇంగ్లిష్ మీడియం చేసేస్తున్నట్లుగా జగన్ ప్రకటించేశారు. కానీ.. దానికి తగ్గట్లుగా.. మానవ వనరులు ప్రభుత్వ స్కూళ్లకు ఉన్నాయా..అన్నది ఎవరికీఅర్థం కాని అంశం. టీచర్లు తెలుగులో బోధిస్తున్నారు. వారిలో ఎక్కువమందికి ఇంగ్లి‌ష్‌పై పట్టు తక్కువ. స్కూలును ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చినంత తేలిగ్గా, పాఠ్యాంశాలను ఇంగ్లి్‌షలో చెప్పించడం సాధ్యం కాదు. దానికోసం ముందస్తు ప్రణాళిక, తగిన కసరత్తు, క్రమ విధానం పాటించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లుగా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులను ఒక్క సారిగా ఇంగ్లిష్‌ మీడియంలో మార్చితే… వారి మానసిక ఆందోళనను వర్ణించడం కష్టం.

సమగ్ర కార్యాచరణ లేకపోతే.. పేద పిల్లల భవిష్యత్‌కే దెబ్బ..!

వ్యవస్థలో ఓ మార్పు తీసుకు రావాలంటే.. ముందుగా.. వచ్చే కష్టనష్టాల గురించి అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మార్పులు  చేయాలి. అలా చేయకకుండా.. ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఇసుక సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించలేక … లక్షల మంది కూలీల ఉపాధిని దెబ్బతీశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లిష్ మీడియం విషయంలోనూ.. ఇలాంటి దుందుడుకు నిర్ణయం తీసుకుంటే… ప్రైవేటు స్కూళ్లలో చదివించలేక .. ప్రభుత్వ బడులకు వస్తున్న విద్యార్థుల … జీవితాలను పణంగా పెట్టినట్లవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత కేర్‌ఫుల్‌గా ఉండాల్సిఉంది.

Source:Telugu360

Tags

follow us

Web Stories