లవ్ టుడే హిందీ రీమేక్.. నిర్మాత బోనీ కపూర్ ఏమన్నాడంటే..?

లవ్ టుడే హిందీ రీమేక్.. నిర్మాత బోనీ కపూర్ ఏమన్నాడంటే..?

కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా సంచలనం సృష్టించింది. ఇద్దరు ప్రేమికులు ఫోన్ మార్చుకుంటే వచ్చే సమస్యల గురించి వినోదాత్మకంగానే చెప్తూ.. విజయం దక్కడానికి నమ్మకం, ఓపిక అవసరమని చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ కాదు స్టార్ హీరోగా కూడా మారిపోయాడు. ధనుష్ లా ఉన్నాడు.. ధనుష్ అంతటివాడు అవుతాడు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని, ప్రదీప్ ప్లేస్ లో వరుణ్ ధావన్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు బోనీ కపూర్ ను ఏకిపారేస్తున్నారు. మంచి సినిమాను మీ చెత్త రీమేక్ లతో నాశనం చేయకండి. కథలు ఉంటే తీయండి.. లేకపోతే సైలెంట్ గా ఉండండి.. అంతేకానీ ఇలా రీమేక్ ల పేరుతో మా మీద పడకండి అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక తాజాగా ఈ వార్తలపై బోనీ కపూర్ స్పందించాడు. లవ్ టుడే హిందీలో రీమేక్ చేస్తున్నాం అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ట్విట్టర్ వేదికగా బోనీ స్పందిస్తూ..” దయచేసి అర్ధం చేసుకోండి.. నేను లవ్ టుడే రీమేక్ హక్కులను పొందలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవం” అని చెప్పుకొచ్చాడు. దీంతో హమ్మయ్య ఒక మంచి పని చేశారు. ఒక మంచి సినిమా బతికిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బోనీ కపూర్.. అజిత్ నటిస్తున్న తెగింపు సినిమాను నిర్మిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో బోనీ హిట్ ను అందుకుంటాడా..? లేదా..? అనేది తెలియాలి.

follow us