షా, మోడీ మొదటి సారి ఫెయిల్..! దటీజ్ పవార్..!

  • Written By: Last Updated:
షా, మోడీ మొదటి సారి ఫెయిల్..! దటీజ్ పవార్..!

మహారాష్ట్ర పరిణామాల వెనుక… మోడీ, షా ద్వయం ప్లాన్ ఉంది. అందుకే ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం.. ఇక శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి అనేది మాటలకే పరిమితమని.. బీజేపీ ఎలాగైనా  బలం నిరూపించుకుంటుందని…భావించారు. కానీ.. అందరి అంచనాలను శరద్ పవార్ తలకిందులు చేశారు. మోడీ, షాల ప్లాన్లు.. పారకుండా చేయగలనని నిరూపించారు. ఇప్పటి వరూ.. మోడీ , షా ఒకే ఒక్క సీటు ఉన్న రాష్ట్రాల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ నిజంగా గెలిచిన మహారాష్ట్రలో మాత్రం.. అనైతిక పద్దతులకు పాల్పడినా… తమ వ్యూహాలను అమలు చేయలేకపోయారు.

మరాఠా యోధుడు శరద్ పవార్ … మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను.. ఎక్కడా హడావుడి పడకుండా మార్చేశారు. అజిత్ పవార్.. బీజేపీతో కల్సి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఏం జరిగిందో.. తెలుసుకునేలోపే.. అందరూ.. శరద్ పవార్ వైపే అనుమానంగా చూశారు. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆయనను విశ్వాసఘాతకుడుగా అభివర్ణించేసింది. శివసేన కూడా.. ఆయన వైపు..అనుమానపు చూపులు చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో..  శరద్ పవార్ ప్లేస్‌లో ఉన్న ఎవరైనా… అలాంటి వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని అనుకోవడం సహజం. కానీ.. శరద్ పవార్ వారిలా ఆవేశపడలేదు. మెల్లగా అజిత్ పవార్ ను ఒంటరి చేశారు. చివరికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి కల్పించారు.

శరద్ పవార్ ను.. మోడీ, షా తక్కువగా అంచనా వేశారు. శరద్ పవార్..రాజకీయంగా.. అజిత్ పవార్ పై అధారపడుతున్నారని…బీజేపీ అభిప్రాయానికి వచ్చింది. దానికి కారణం… శరద్ పవార్…మహారాష్ట్ర రాజకీయాలను అజిత్ పవార్ కు ఎప్పుడో అప్పగించారు. తాను.. తన కుమార్తె సుప్రియా సూలే జాతీయ రాజకీయాల్లోనే ఉన్నారు. ఈ కారణంగా… అజిత్ పవార్ ను.. తమ వైపు తిప్పుకుంటే.. శరద్ పవార్ కూడా ఏమీ చేయలేరని..బీజేపీ అగ్రనేతలు భావించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ వ్యూహాలకు తన విరుగుడు ఎలా ఉంటుందో.. పవార్ రుచి చూపించారు. సొంత బలగాన్ని నిలబెట్టుకోవడమే కాదు ప్రత్యర్థిని పడగొట్టారు.

Source : Telugu360

Tags

follow us

Web Stories