శర్వానంద్ శ్రీకారం రివ్యూ.!

sreekaram movie review and rating
sreekaram movie review and rating

వ్యవసాయం లో నష్టాలు తప్ప లాభాలు ఉండవని ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒక వేళ లాభాలే ఉంటే ఊర్లో పొలాలను వదిలేసి ఎంతోమంది రైతులు సిటీకి వచ్చి కార్మికులుగా పనిచేయరు. కొంతమంది వ్యవసాయం చేయడం తప్ప వేరే పని తెలియక అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తుంటారు. అలాంటి అంశాలన్నీ కలగలుపుకుని తీసిన సినిమానే శ్రీకారం. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఇక శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కార్తీక్ (శర్వానంద్) నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కూడా సంపాదిస్తారు. కార్తిక్ తండ్రి కేశవులు(రావు రమేష్) ఊర్లో వ్యవసాయం చేస్తూ అప్పుల పాలు అవుతాడు. ఆ అప్పులన్నీ కార్తిక్ ఉద్యోగం చేస్తూ తిరుస్తాడు. ఇక కార్తిక్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వడంతో అతడి తండ్రి కేశవులు ఊర్లో అందరికి తన కొడుకు అమెరికా వెళతాడు అని చెప్పుకుంటూ మురిసిపోతాడు. కానీ కార్తిక్ తాను ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తా అంటూ తండ్రికి షాక్ ఇస్తాడు. దాంతో కార్తిక్ ప్రియురాలు చైత్ర (ప్రియాంక అరుల్ మోహన్) మరియు హీరో తండ్రి వారించినా కార్తిక్ వినిపించుకోకుండా ఊరికి వచ్చేస్తాడు. ఊరంతా కలిసి వ్యవసాయం చేద్దామని పిలుపుస్తాడు. మరి సాఫ్ట్వేర్ కొలువు వదిలి వ్యవసాయం మొదలు పెట్టిన కార్తీక్ సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే సినిమా కథ.

మహేష్ బాబు మహర్షి సినిమా వీకెండ్ ఫార్మింగ్ అనే నినాదం తో వస్తే..శ్రీకారం ఉమ్మడి వ్యవసాయం లైవ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమా యూత్ కు మంచి సందేశాన్ని ఇచ్చింది. ప్రేక్షకులకు నచ్చే వాణిజ్య అంశాలను జోడించి తాను చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు చక్కగా చెప్పాడు. శ్రీకారం సినిమా భావోద్వేగాలతో కూడి పాత్రలను అందరికీ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు దర్శకుడు. పుట్టిన ఊర్లో ఏం పని చేయాలో అర్థం కాక..నగరంలో ఉండలేక నేటి తరం యువత పడే కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

హీరో ఊర్లోకి వచ్చినప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఉమ్మడి వ్యవసాయం అంటూ వస్తాడు. కానీ అందులో సాధక బాధకాలు చాలానే ఉంటాయి. వాటిని పైపైనే చూపించిన దర్శకుడు వ్యవసాయాన్ని మాత్రం అందంగా చూపించాడు. అయితే అందంగా చూపించడం అనేది కాస్త ఫిల్మిగానే అనిపిస్తుంది. ఊర్లో కార్తీక్ ఆధునిక వ్యవసాయం తో పంటలు పండించడం మొదలు పెట్టక లాభాలు కూడా గడిస్తాడు. అక్కడితోనే కథ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కార్తిక్ కు తండ్రి కేశవులు కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్ ఏకాంబరం (సాయి కుమార్) తీసుకువచ్చిన ఇబ్బందులు వాటిని తట్టుకుని హీరో నిలబడటం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సినిమాలో నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ లు సినిమాకు ప్రాణం పోసాయి. యువరాజ్ కెమెరా పనితనం పల్లె టూరి అందలాను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం తో పాటు సాంగ్స్ కూడా భాగున్నాయి. ఇక దర్శకుడు కిషోర్ కు ఇదే తొలి చిత్రం అయినా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు.