మానవత్వం చాటుకున్న కేసీఆర్..వెంటనే కారు దిగి..

KCR Helping Hand
KCR Helping Hand

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు.. ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలు, ఇతర పనులతో బిజీగా ఉండే సీఎం.. మార్గం మధ్యలో కనిపించిన ఓ వృద్ధుడిని చూసి.. కాదు దిగి.. ఆయన సమస్య తెలుసుకునే వెంటనే పరిష్కరించాలని అధికారులను పురమాయించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ మధ్యామ్నం సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లారు.. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ వెంటనే కారు దిగి.. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన మహ్మద్ సలీమ్.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. నాలుగేళ్ల క్రితం ఇక బిల్డింగ్‌పై నుంచి పడడంతో కాలు విరిగిపోయిందట.. ఆ వృద్ధుడి కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రిని విన్నవించుకున్నాడు.

దీనిపై వెంటనే స్పందించిన సీఎం.. సలీమ్ సమస్య పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని.. హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో టోలి చౌకిలోని సలీమ్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపి.. సలీమ్ దగ్గర వికలాంగుడిగా ధృవీకరణ పత్రం ఉండడంతో.. వెంటనే పెన్షన్ మంజూరు చేశారు.. ఇక, జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఖర్చులతో సలీమ్ కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతోన్న సలీమ్‌ కుమారుడి కోసం సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. రోడ్డుపై దీనంగా ఉన్న ఆ వృద్ధుడిని సీఎం గమనించి మొత్తానికి వెంటనే సహాయం అందేలా చేసి మానవత్వాన్ని చాటుకున్నారు సీఎం కేసీఆర్.