ట్విస్ట్ : నిర్భయ కేసులో ముగ్గురికే ఉరి…!?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. నలుగురిని ఒకేసారి ఉరితీయాలని కోర్టు ఆదేశించడంతో.. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు జైలు అధికారులు. అయితే, శిక్ష నుంచి తప్పించుకోవడానికి… మరింత జాప్యం చేయడానికి నిర్భయ దోషులు చేయని ప్రయత్నాలు లేవు.. తాజా పరిస్థితి చూస్తుంటే… నిర్భయ దోషుల్లో ముగ్గురికే శిక్ష పడనుందా? మరో నిందితుడు వినయ్.. రేపు శిక్ష నుంచి తప్పించుకోనున్నాడా? దోషి వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున.. మిగతా ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేయాలని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ముకేష్ సింగ్ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో వినయ్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున.. మిగతా ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేయొచ్చని వివరణ ఇచ్చింది కేంద్రం.

నిర్భయ దోషులకు శిక్ష అమలు అంశం చివరి క్షణాల వరకూ మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా వినయ్ వేసిన క్షమాభిక్ష పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇటు ప్రభుత్వం మాత్రం ఒకేసారి నలుగురినీ ఉరితీయాలన్న నిబంధనేమీ లేదని.. మిగిలిన ముగ్గురిని ఉరితీయొచ్చని అంటోంది. మరోవైపు ఉరిశిక్ష సమయం దగ్గర పడుతున్నకొద్ది.. దానిని వీలైనంత జాప్యం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు నిర్భయ కేసు దోషులు.. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.. అత్యాచారం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని.. కొన్ని రోజుల క్రితం అతను సుప్రీంను కోరాడు. అయితే, అతని విజ్ఞప్తిని తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.. తాజాగా పవన్ మళ్లీ ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశాడు.