జగన్ నిర్ణయాలు ఏపీకి చిత్రసీమను దూరం చేస్తున్నాయా..?

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు చిత్రసీమ కు కూడా తలనొప్పిగా మారుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ , సినీ విశ్లేషకులు. పాదయాత్ర తో ప్రజల మన్నలను పొందిన జగన్..పాలన లో మాత్రం ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ…ఆ పధకాలను అమలు చేయడం కోసం కొంతమందిని బాధపెట్టి , మరికొంతమందిని సంతోష పెట్టడం ఎవ్వరికి నచ్చడం లేదు. రీసెంట్ గా పెన్షన్ దారులకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎక్కువ భూములు ఉన్న , కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఇలా పలు కారణాలతో ఇంట్లో వృద్ధుల , వితంతువు, వికలాంగుల పెన్షన్ కట్ చేయడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటె తాజాగా జీవో 01 ను తీసుకొచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. రద్దీ ప్రాంతాల్లో సభలు , ర్యాలీ లు జరపకూడదని , ఒకవేళ జరుపుకోవాలన్న పోలీసులు చెప్పిన ప్రదేశాల్లో జరుపుకోవాలని తెలిపి పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ నిర్ణయం ఫై ప్రతిపక్షపార్టీలే కాదు చిత్రసీమ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటీకే చిత్రసీమ పట్ల ఎన్నో షాకింగ్ నిర్ణయాలు తీసుకొని సినీ స్టార్స్ ను , నిర్మాతలను , డిస్ట్రబ్యూటర్స్ ను నష్టపరచగా..ఇప్పుడు జీవో 01 తో మరోషాక్ ఇచ్చాడు. సంక్రాంతి బరిలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాల మేకర్స్ ఈ జీవో తో తలపట్టుకున్నారు.
గతంలో ఇలాంటి వేడుకలకు పోలీసులు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా అనుమతి ఇచ్చేవారు. ఎందుకంటే ఇలాంటి వేడుకలు జరిగితే ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. అయితే ఈ సారి మాత్రం ఏపీలో ఉన్న ప్రభుత్వం వేరు… ముందస్తుగా అనుమతులు ఇచ్చి.. తర్వాత పెద్ద ఎత్తున జనం వస్తారు కాబట్టి అనుమతి ఇవ్వలేమని మాట మార్చడం కామన్ అయిపోయింది. తాజాగా ఒంగోలు వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. మొదట ఏబీఎం గ్రౌండ్ కు అనుమతించి తర్వాత రద్దు చేశారు. ఊరి బయట పెట్టుకుంటే.. అక్కడా పర్మిషన్ ఇవ్వడానికి చాలా షరతులు పెట్టారు. అందులో ఒకటి.. వెయ్య మంది పోలీసుల్ని భద్రతకు పెడతాం… ఒక్కొక్కరికి వెయ్యిచొప్పున చెల్లించాలని రూల్ పెట్టారు. అంతేనా అంత మందిని పెట్టినా… ఎలాంటి ఘటనలు జరిగినా.. ట్రాఫిక్ జాం జరిగినా నిర్వాహకులదే తప్పని షరుతులు పెట్టారు. ఇలాంటి షరతులు చూసి ఏర్పాట్లు చేసుకుంటున్న శ్రేయాస్ మీడియా వారు షాక్ కు గురయ్యారు .
అలాగే చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక విషయంలోనూ అదే జరిగింది. ముందు నుండి వైజాగ్ RK బీచ్ లో నిర్వహించాలని అనుకున్నారు. అలాగే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. తీరా ఈవెంట్ దగ్గర పడినసమయంలో అక్కడ కాదని మరో చోటుకు వేడుక మార్చాలని ఆదేశాలు జారీ చేసారు. దీంతో చేసేదేం లేక ఆంధ్ర యూనివర్సిటీ కి మార్చారు. ఈ నెల 08 న ప్రీ రిలీజ్ వేడుక జరపబోతున్నారు. ఆ సమయానికి ఇంకెన్ని కండిషన్లు పెడతారో అని ఈవెంట్ నిర్వాహకులు ఖంగారు పడుతున్నారు. ఇలా జగన్ ప్రభుత్వం చిత్రసీమ ను ఇలా నిత్యం ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆంధ్ర లో షూటింగ్ కూడా చేసుకునే పరిస్థితి ఉండదని సినీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు.
జీవో1 ను సాకుగా చూపి చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు బాలక్రిష్ణ వీరసింహారెడ్డి సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లకు అనుమతివ్వక పోవడం దేనికి సంకేతం. మొన్నటికి మొన్న చిరంజీవి పవన్ కు అనుకూల వ్యాఖ్యాలు చేశారని.. దాని పర్యవసానమే వాల్తేరు వీరయ్యకు ఇబ్బందులు అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు బాలక్రిష్ణ సైతం టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని మెగా , నందమూరి అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ మరోసారి అలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని సగటు అభిమాని కోరుకుంటున్నారు.